తొందర,ఆదుర్దా,కంగారు,కొంపలంటుకుంటున్న హడావుడి ఇలా వంద రూపాలలో కనిపిస్తుంది ఇవ్వాళ్టి జనాల దూకుడు.ఇటీవల ఒక వైజ్ఞానిక పత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం అతివేగంతో వాహనాలు నడిపేవారికి,సాధారణవేగంతో వెళ్ళేవారు గమ్యస్థానం చేరేందుకు పట్టే సమయంలో వ్యత్యాసం కేవలం మూడంటే మూడు నిమిషాలు. సాధారణవేగంతో వెళ్ళేవారు ఇళ్ళకు క్షేమంగా చేరేందుకు చాలా వరకూ అవకాశాలు ఉన్నాయి.కానీ మితిమీరిన వేగంతో పోయేవారు‘పోవటానికే’అని చూయించటానికి నిదర్శనాలు కుప్పలు.
స్పీడు ఆధునికజీవనానికి ఓ‘హాల్ మార్క్’అన్న అపోహ చాలా మందిలో ప్రస్ఫ్టుటంగా కనిపిస్తుంది.ఫలితాలూ కొందరు అనుభవిస్తూనే ఉన్నారు.అసలు విషయానికొస్తే…మోహన రావు అంటే దాదాపుగా ఎవరికీ తెలియకపోవచ్చు.కొంతమందికి తమతమ మిత్రులో,బంధువులో,కుటుంబసభ్యులో గుర్తుకురావచ్చు.అది మీ ఊరు కావచ్చు,మరో ఊరు కావచ్చు.
మోహనరావంటే వైజాగులో కూడా ఇదే పరిస్తితి కాకుంటే,వైజాగ్ ఆర్టీసి కాంప్లెక్స్ ఎదురుగా కొబ్బరి బోండాలు అమ్మే మోహనరావంటే చాలామంది అతనా అంటారు.మనవాడు నాకు మంచిమితృడు,తరచూ కలుస్తుంటాము.
మొన్నీ మధ్య మోహనరావూ,నేనూ కలిసి శ్రీరామా టాకీస్ దగ్గర ఉన్న రెడ్డి అరటిపళ్ళ షాపు దగ్గరకెళ్ళాం అతనేదో తీసుకోవాలంటే. శ్రీరామా టాకీస్ అంటే సినీ దర్శకుడు తేజ కొనుగోలు చేసింది.ఇక రెడ్డి అరటిపళ్ళ షాపు అంటే దాదాపు సగం విశాఖపట్నానికి అరటిపళ్ళను హోల్ సేల్ గా అతనే అమ్ముతాడు.కూర అరటి కాయలు తప్ప అతని దగ్గర అన్నిరకాల అరటి వెరైటీలు దొరుకుతాయి.
షాపులో రెడ్డమ్మ బిజీబిజీగా ఉంది(రెడ్డమ్మ అంటే రెడ్డి వాళ్ళ అమ్మ కాదు,సదరు రెడ్డి గారి భార్య).
‘యేటి…మోహన్రావ్,ఇటుకేసి రాటమే మానీసీవేటి?యాప్లీసు కాయలు గాని తింతనవేటి ’?అంటూ ఆరాతీసింది.
మరిమనవాడూ తక్కువతినలేదు కదా?
‘యాప్లీసులూ…గీప్లీసులు ఎవరట్టుకొస్తారు నాకాడికి?కేజీ ఆస్పత్రి లోగానీచేర్నానా?రామాటాకీస్ జంక్సన్లో దుకానం గానీ ఎట్టినానా?యెందుకా యెటకారం రెడ్డమ్మా,యేదో రెడ్డి యాపారం ఎలగుందో సూద్దారని వొచ్చిన మనిసిని ఒగ్గవు గందా,కమ్మకట్టకుంట’అన్నాడు.
ఈలోపు ఒకమ్మాయి మా ఇద్దరి పక్కనుంచి వెళ్ళి రెడ్డమ్మతో అరటిపళ్ళు బేరమాడుతూ,తనక్కావాల్సినవి ఎందుకుంటూ మధ్యమధ్యలో వెనక్కి చూస్తుంది.తను పదేపదే ఎవరినబ్బా ఇన్నిసార్లు వెనక్కితిరిగి చూస్తుంది అని అనుమానంగా మేమూ ప్రతిసారీ చుట్టుపక్కలా చూట్టం మొదలెట్టాం.
నల్లని పల్సర్ బైకు మీద సన్నగా రివట్లా,జుట్టుపోలిగాడులా ఉన్న ఒకానొక శాల్తీ తప్ప మాకెవ్వరూ అనుమానాస్పందంగా కనిపించలేదు.







