భాషా సాహిత్యాలులేని జాతి ఇవాళ ప్రపంచంలో ఎంత వెతికినా ఎక్కడా కనబడదు. క్రీస్తుశకం ప్రారంభానికి ముందుగా ఎన్నో శతాబ్దాల నుంచే తెలుగువారు వివిధ ప్రాంతాలలో జీవించిన దాఖలాలు ఉన్నాయి. శాతవాహనులు సామ్రాజ్యాన్ని స్థాపించి కొన్ని వందల ఏళ్ళు పాలించారు. వీరు తెలుగు వారే. వీళ్ళ కుదురు తెలుగు ఏకగణాలలోనే ఉంది. రాజులు ప్రాకృత సంస్కృత భాషలకు ఎగబడినా నాటి సామాన్య ప్రజానీకం తెలుగులోనే నిత్యవ్యవహారాన్ని జరుపుకొనేవారు. తమకు కావలసిన సాహిత్యాన్ని సృష్టించుకొన్నారు.
ప్రాకృత జనుల సాహిత్యం మౌఖికంగానే ఉంటుంది. సామెతలు, పొడుపు కథలు, పనిపాటలు, వీరగీతాలు మొదలైనవి వాటిలోని భాగాలు. మత విశ్వాసాలూ, మంత్ర చర్యలకు వాడే మాటలు కూడా సంస్కృతిలోని భాగమే. తెలుగుగడ్డ మీద ఆదిలో బౌద్ధ, జైనమతాలు చాలా బలపడ్డాయి. జనాభాలో అత్యధిక సంఖ్యాకులు ఇతర మతాల వైపు ; కావడం చూసి బ్రాహ్మణ్యం ప్రాబల్యం కోసం ప్రయత్నాలు చేసింది. జనుల ఆచార వ్యవహారాలకు ఆస్కారం కలిగించే పాడిపంటలకు అవసరమైన పశు సంపదను యజ్ఞయాగాదులలో బలికాకుండా ఈ అహింసామతాలు కాపాడడంచేత జన సామాన్యానికి, వాణిజ్యవర్గాలకు ఈ మతాలు అభిమాన పాత్రమయ్యాయి. మతాధికారులకు ప్రజలు కానుకలు, దానాలు, ధర్మాలు చేయసాగారు. ఆరామాలు, బసదులు ఐశ్వర్యవంతాలయ్యాయి. మాన్యాలూ, తోటలూ వృద్ధి చెందాయి. రైతాంగం వీటి మీద బతికేవారు. జీవనాధారమైన మతం ప్రజలకు అభిమతం.
ఆదిలో వైదికమతం యజ్ఞయాగాదులనే అంగీకరించింది. విగ్రహారాధన, గుళ్ళు, నోములు, వ్రతాలు నిషేధించింది. స్తీలను, శూద్రులనూ నిరక్షరాస్యులను చేసింది. మతాన్ని సృష్టించింది. ఇది వేదోక్తమని అధర్వవేదం సాక్ష్యాలతో ప్రచారం చేసింది. బ్రాహ్మణ్యం శంఖంలో పోస్తేనే గాని రాచరికం తీర్థం కాదు. అందుచేత రాజులు వైదికమతాన్ని ఆదరించారు. రాణులు బౌద్ధ జైనులను పోషిస్తూనే వచ్చారు.
ప్రజల భాషలో కాక సంస్కృత ప్రాకృత భాషలలో శాసనాలు వేయించడం పాలకులకు అలవాటు. అయితే ఆ శాసనాలలో స్థలనామాలు, వ్యక్తులపేర్లు తెలుగులోనే ఉంచక తప్పదు. క్రీస్తుశకం తొలి శతాబ్దాలలో తెలుగు మాటలు ఎలా ఉండేవో ఈ శాసనాలవల్ల తెలుస్తోంది. రేనాటి చోళులు తెలుగులోనే తమ శాసనాలను వేయించారు. వీటిలో కొన్ని అస్పష్ట ఛందస్సులలో ఉన్నాయి. ఆనాడు ఒక రకమైన సాహిత్యం లిఖిత రూపంలో కూడా ఉండేదన్న భావనకు ఆస్కారం ఉంది.
విద్యావంతులు మార్గరీతులలోనే సాహిత్యాన్ని సృష్టించుకొనేవారు. తూర్పు చాళుక్యుల ఏలుబడిలో దేశి కవితలకు కూడా రాజాదరణ లభించింది. ఈ సంగతిని నన్నెచోడుడు ఇలా చెప్పాడు.
మును మార్గ కవిత లోకం బున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం గున నిలిపి రంధ్రవిషయం బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్
దేశి కవితను పుట్టించిన వాళ్ళు పలువురు ఉన్నా, వాళ్ళు నిలిపిన కవితలు అట్టే కాలం నిలవలేదు. తూర్పు చాళుక్యులలో రాజరాజ నరేంద్రుడు నేటికి రమారమి వెయ్యేళ్ళ కిందట వైదిక మత ప్రచారం కోసం మహాభారతంలోని నిరూపితార్థాన్ని తన కులబ్రాహ్మణుడు నన్నయభట్టు చేత తెలిగింప చేశాడు. ఇదే మన ఆది కావ్యం. అంతకుముందున్నవన్నీ నశించాయి గాని, ఆ రోజుల్లో కవులూ ఉండేవారు, రచనలూ చేసేవారు. వేంగీదేశంలో విద్వత్సభలు ఉండేవి. నన్నయ రెండున్నర పర్వాలే ఆంధ్రీకరించాడు. మిగతా భాగాన్ని ఎవరైనా పూర్తి చేయాలని సంకల్పించడానికే రెండు శతాబ్దాలు పట్టింది. నన్నయ సారమతిని కవీంద్రులు మెచ్చుకోవడానికి భారతాన్ని తెలిగించితే తిక్కన మాత్రం భారతామృతాన్ని ‘ కర్ణపుటంబుల నారగ్రోలి ‘ ఆంధ్రావళి మోదం చెందడానికి పూర్తి చేశాడు. జనంలో అధిక భాగం అక్షరాస్యులు కానప్పుడు కావ్యాలను ఎవరైనా చదవి వినిపిస్తేనే దానిని ఆరగ్రోలడం వీలవుతుంది. మహాభారతమే కాదు రామాయణం కూడా ఇంతే .
భాస్కర రామాయణం చంపూకావ్యం. రంగనాథ రామాయణం ద్విపద కావ్యం. ఇది గానం చేయడానికి అనువైనది. అందుకే దీనినే ఈనాటికీ తోలుబొమ్మలాటలో గాయకులు పాడుతూ ఉంటారు. తెలుగులో రామ కథలు ఎన్నెన్నో ప్రక్రియలలో వెలువడ్డాయి. అయితే ఏ ఒక్కటీ బహుళ ప్రచారాన్ని పొందలేదు. రామాయణ భారతాలను తెనిగించి భాగవతం జోలికి ఎవరూ వెళ్ళకపోవడం బమ్మెర పోతరాజుగారు తమ అదృష్టంగా భావించారు. దానిని భక్తితో, అంతకు మించిన ఆవేశంతో రచించారు. పోతరాజుగారి భాగవతం ఎంత ప్రసిద్ధమైనదంటే దానికి వరవడి పెట్టిన ఎర్రాప్రగడ గారి హరివంశం అట్టే కనబడకుండా కాలగర్భంలో ఒక మూలపడి ఉండిపోయింది.
ఎర్రాప్రగడ గారిని ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ఈయన భారతంలో నన్నయగారు వదిలివేసిన అరణ్యపర్వ భాగాన్ని పూర్తి చేయడమే కాక హరివంశంతోపాటు నృసింహపురాణం కూడా రచించారు. ఈ పురాణంలోనే ప్రబంధాల తొలి రూపరేఖలు కనబడతాయి. ఎర్రాప్రగడగారి సమకాలికుడు నాచన సోమన నిజంగా నవీనగుణ సనాధుడు. సాహిత్య రచనలో సమకాలీన సమాజాన్ని ప్రతిఫలింప చేయడం ఇతనితోనే ప్రారంభమైంది. ఇతని ‘ ఉత్తర హరివంశం ‘ అనే కావ్యం పురాణ కథలకు ఎలా నగిషీలు పెట్టాలో తెలియజేసింది.
మార్గ పద్ధతులను అనుసరించే కవులు పురాణేతిహాసాలను సనాతన వైదిక మత నిర్దేశాలకు అనువుగా రచిస్తూ ఉంటే వీరశైవులు దేశి ఛందాలలో, దేశీయమైన ఇతివృత్తాలను కొత్త పురాణాలుగా భక్తుల చరిత్రలుగా రూపొందించారు. ద్విపద ప్రచార సాధనమైంది. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, దక్షణ భారతంలోని చారిత్రక పురుషుల జీవిత గాథలు కుల వర్గ భేదాలను రూపుమాపి ఆడా, మగా అందరూ సమానులే అన్న మతస్థాపనకు వీరశైవులు ఉద్యమాలను నడిపారు. జనసాహిత్యానికి చేరువలో ఆ రూపాలకు సన్నిహితమైన వచనాలను రచించారు. ఆదిలో వచనాన్ని పాడేవారు. ఇప్పటికీ యాగంటి వారి రచనలను రాయలసీమలో ముఖ్యంగా గానం చేస్తారు.
వీర శైవులలాగే వైష్ణవులు కూడా వచనాలను రచించారు. కృష్ణమాచార్యుడు కాకతీయుల కాలంలో సింహగిరి వచనాలు నాలుగు లక్షలు రచించాడు. వీటిలో అధిక భాగం రాగిరేకులపై చెక్కించి శ్రీరంగం పంపించాడు. తాళ్ళపాక కవులు కృష్ణమాచార్యునే అనుసరించారు. అన్నమయ్య పాటకు సాహిత్య గౌరవాన్ని కల్పించాడు. ముప్ఫైరెండు వేల సంకీర్తనలలో తెలుగు జీవితాన్ని, ఆచార వ్యవహారాలను భద్రం చేశాడు. భక్తీ, దానిని మించిన రక్తీ ఈ సంకీర్తనలలో సజీవంగా ఉన్నాయి. భక్తి బంగారానికి రక్తి శృంగారం రస సౌరభాన్ని పూసింది.
సంస్కృత సాహిత్యంలో శృంగారం వెర్రి తలలు వేశాక అష్ట రసాలలో ఇదే ఇష్టరసమయ్యాక ఆ ఉన్మాదం తెలుగులోనికి కూడా దిగుమతి అయింది. ; నైషధాన్ని శ్రీనాధుడు శృగార నైషధంగా ఆంధ్రీకరించాడు. ప్రౌఢి పలుకు, నుడికారం సమపాళ్ళలో వున్న శ్రీనాధుడు కొత్త వరవళ్ళు పెట్టాడు ఇతని తర్వాత ఎందరో తమ కావ్య నామాలలో ‘ శృంగార ‘
అనే విశేషణం తగిలిస్తూ వచ్చారు.
ఏదో ఒక పురాణ గాథను తీసుకొని అష్టాదశ వర్ణనలు సందర్భశుద్ధి ఉన్నా లేకున్నా జొప్పించి నాయక అంగాంగ వర్ణన చేసి నాయికా నాయకుల సంభోగ శృంగార చేష్టలను అతిగా వల్లించడం తెలుగు సాహిత్యంలో సర్వసామాన్యమైనది. పుణ్యక్షేత్రాలు, మాహాత్మ్యాలు కవులకు ముడి సరుకులయ్యాయి. ఎంత నీచంగా బతికినా, ఎన్ని పాపాలు చేసినా, కడశ్వాస వరకు పంచ మహాపాతకాలు చేస్తున్నా, దివ్యక్షేత్రంలో మరణించిన వానికి ముక్తి రెడీమేడ్‌గా దొరకడం అన్నది ఈ గ్రంథాలు చాటుతాయి. ఈ మూస కథలలో కూడా కొందరు ప్రతిభావంతులు ఉన్నంతలో తమ నేర్పు చూపగలిగారు. పదగుంభనం వాళ్ళ ప్రౌఢత్వానికి చిహ్నం.
కేవల కల్పనా కథలు కృతిమరత్నాలనీ, ఆద్యసత్కథలు గనిలో తీసిన శుద్ధి చేయని మణులని ఈ రెండింటిని కాక నచ్చిన పాతకథను సానపట్టి ప్రజలకివ్వాలని నాటి కవులు భావించారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన అష్ట దిగ్గజాలలో పెద్ద పీటల వాళ్ళు. ఇంతటి ఉద్దండుల రచనల ముందు ఇతరుల కావ్యాలు సూర్యుని ముందు దివిటీలే. అందుకే తరువాత వచ్చిన పింగళి సూరన్న, భట్టుమూర్తి ముందు రెండర్థాల కావ్యాలు రాసి తమ గొప్ప తనం చాటుకున్నారు. తర్వాత కళా పుర్ణోదయం, వసు చరిత్ర రాశారు. సూరనగారి కళాపూర్ణోదయం అంత గొప్ప కావ్యం కన్యాశుల్కం వచ్చేదాకా ఇంకేది పుట్టలేదు. వసుచరిత్రకు వెనువెంటనే ఇమిటేషన్లుగా పిల్ల వసు చరిత్రలు కోకొల్లలుగా వచ్చాయి. భట్టుమూర్తి శ్లేషలతో తెలుగు సాహితిని ఆశ్లేషించాడు. ఆ కౌగిలి విడిపించుకొందికి చాలాకాలం పట్టింది.
శివకవులు దేశి సాహిత్యానికి ఎంత సేవ చేశారో శతక కవులు ఆత్మాశ్రయ కవిత్వానికి అంత ప్రాణం పోశారు. చాటుకవులు కొత్త బాటలు వేశారు. తెలుగు సాహిత్యం అంతా గాలించినా వేమనగారివంటి ‘ సామాజిక స్పృహ ‘ గల రచయిత ఇంకెవరూ కనబడడు. కనబడ్డా అంత ఉన్నతునిగా కంటికి ఆనడు. ఆధునికులలో ఉన్నవ లక్ష్మీనారాయణగారొక్కరే వేమన ఆలోచనా విధానాలకు అత్యంత సన్నిహితులు.
కడపటి రాజుల యుగం నాటికి కవుల కక్కుర్తి స్పష్టంగా వెల్లడవుతూ వచ్చింది. పోషకుడు మెచ్చి ఇచ్చాడో ” చంద్రరేఖావిలాసం “, ఇవ్వక పోతే ” చంద్రరేఖావిలాపం ” అల్లడానికి పూనుకొనే స్థితికి సాహిత్యం దిగజారింది.
‘ కావ్యం యశసే, అర్థకృతే ‘ అన్న నిర్వచనాల దగ్గరే ప్రబంధ కవులూ, వారి తరువాతి వారు ఆగిపోయారు. వ్యవహారాన్ని విదితం చేయడం, శివేతరమైన దానిని ఛేదించడం మొదలైన సాహిత్య లక్షణాలను పందొమ్మిదో శతాబ్దపు ఉత్తరార్థంలోనే రచయితలు గాఢంగా విశ్వసించారు. సంఘసంస్కారం కోసం వీరేశలింగం గారు, గురజాడ అప్పారావుగారు సాహిత్యమే ఉత్తమ సాధనంగా భావించారు. ప్రజలను చైతన్యవంతులను చేశారు. మేలు కొంటున్న ప్రజలను జోకొట్టే ఉద్యమాలు భావకవిత్వం రూపంలో వచ్చినా అవి గురజాడ ప్రభావం ముందు ఉత్తరోత్తరా నిలబడలేకపోయాయి. గేయం ధ్యేయమైంది.
గురజాడ అప్పారావుగారు దేశి ఛందస్సులను చేపట్టి ప్రజలకు చేరువగా కవిత్వాన్ని తీసుకు వచ్చారు. అక్షరాస్యులు అల్ప సంఖ్యలో ఉన్నప్పుడు ప్రచార సాధనం నాటకమే అని గుర్తించారు. శ్రవ్య కావ్యాలను ప్రదర్శన కళలుగా మార్చగలిగే వీలు కల్పించారు. గురజాడ దేశమంటే మనుష్యులన్నాడు. శ్రీ శ్రీ మనుష్యులంటే శ్రమ జీవులే అని స్పష్టపరిచాడు. అభ్యుదయ దృక్పథమే సాహిత్యంలో ప్రజలను సాయుధులను చేయగలదు. ఇదే నిజమైన వారసత్వం. — ఆరుద్ర
http://languageengineering.blogspot.com/2005_07_01_archive.html నుంచి







